అహ్మదాబాద్: నెలసరితో ఉన్న విద్యార్థినుల పట్ల అనాగరికంగా వ్యవహరించిన గుజరాత్‌లోని శ్రీ సహజానంద్ గర్ల్స్ ఇనిస్టిట్యూట్ ఘటన వెనక ఓ స్వామిజీ నీచపు బుద్ధి ఉన్నట్టు తెలిసింది. పురాణాల కాలం నుంచి నెలసరితో ఉన్న మహిళలు కొన్ని కట్టుబాట్లను పాటిస్తున్నారని, అవి పాటించని పక్షంలో వాళ్లను ద్వేషించినా తప్పు లేదని స్వామి నారాయణ్ భుజ్ మందిర్ మత బోధకుడు కృష్ణస్వరూప్ దాస్‌జీ తన అనుయాయులకు చెప్పినట్టున్న వీడియోలు కొన్ని బయటపడ్డాయి. శ్రీ సహజానంద్ గర్ల్స్ ఇనిస్టిట్యూట్‌ను స్వామి నారాయణ్ టెంపుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
రుతుక్రమంలో ఉన్న మహిళలు వండి పెట్టిన ఆహారం తిన్నవారెవరైనా వచ్చే జన్మలో ఎద్దులై పుడతారని స్వామిజీ ఓ వీడియోలో చెప్పుకొచ్చారు. అందుకే నెలసరి ఉన్న మహిళలు వంట చేయకూడదని స్వామీజీ సెలవిచ్చారు. ఒక వేళ శాస్త్రాలు పట్టించుకోకుండా నెలసరిలో ఉన్నా కూడా భర్తకు వండి పెడితే.. ఆ మహిళలు మరు జన్మలో కుక్కలై పుడతారని పేర్కొన్నారు. మగాళ్లంతా వంట నేర్చుకుని, నెలసరి సమయంలో మహిళలు ‘ధర్మం’ పాటించేలా చూడాలని అన్నారు. ఇక స్వామీజీ వ్యాఖ్యలపై స్థానిక మీడియా వివరణ కోరగా.. అక్కడి సిబ్బంది నిరాకరించారు.