కారు.. ఆరు!

యాదాద్రి : మున్సిపల్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవులకు సోమవారం జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సత్తా చాటింది. ఆరు మున్సిపాలిటీలను, ఐదు వైస్‌ చైర్మన్‌లను ఆ పార్టీ గెలుచుకుంది. సీపీఎంకు ఒక చోట వైస్‌ చైర్మన్‌ దక్కింది. ఆలేరు, భూదాన్‌పోచంపల్లి, మోత్కూరులో సొంత బలంతో పదవులను కైవసం చేసుకోగా భువనగిరి, యాదగిరిగుట్టలో ఎక్స్‌ అఫిషియో, ఇండింపెండెంట్ల ఓట్ల ద్వారా చెర్మన్, వైస్‌చైర్మన్‌ పదవులను గెలుపొందారు. చౌటుప్పల్‌ కాంగ్రెస్‌ కూటమిలో చీలిక తెచ్చి సీపీఎం కౌన్సిలర్ల మద్దతుతో చైర్మన్‌ పీఠం దక్కించుకున్నారు. సీపీఎంకు వైస్‌ చైర్మన్‌ దక్కింది.



దీంతో జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ తన పట్టు నిలుపుకుంది. అభ్యర్థుల ఎంపిక నుంచి చైర్మన్‌ ఎంపిక వరకు బాధ్యతలన్నీ ఎమ్మెల్యేలపైనే మోపడంతో వారు సవాల్‌గా తీసుకుని విజయం సాధించారు. భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఆలేరులో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, చౌటుప్పల్‌లో మునుగోడు నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ముందుండి  నడిపించారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన దిశానిర్దేశంతో క్లీన్‌ స్వీప్‌ చేశారు.